Tuesday, 23 June 2020

ఎప్పుడు సంపద కలిగిన

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండినఁ
గప్పలు పదివేల చేరుఁ గదరా సుమతీ!

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ!
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక నొగిఁదరు చైనం
గకవికలు గాక యుండునె
నకలంబున గొట్టుపడక సహజము సుమతీ!

Wednesday, 17 June 2020

ఉపమింప మొదలు తియ్యన

ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱుకు కైవడి నేపో
నెపములు వెదకును గడపటఁ
గపటపు దుర్జాతిపొందుగదరా సుమతీ!

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యులమనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!

ఎప్పుడుఁ తప్పులు వెదకెడు
నప్పురుషునిఁ కొల్వఁగూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

Wednesday, 10 June 2020

ఉత్తమ గుణములు నీచున

ఉత్తమ గుణములు నీచున
కెత్తెరగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱగపోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మెదవుకడ నున్న వృషభము
జదువని యా నేచుకడకుఁజనకుర సుమతీ!

ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ!

Monday, 8 June 2020

ఇచ్చునదె విద్య రణమునఁ

ఇచ్చునదె విద్య రణమునఁ
జొచ్చునదె మగతనంబు సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు వాదుకు
వచ్చునదె కీడుసుమ్ము వసుధను సుమతీ!

ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!

Thursday, 4 June 2020

అప్పిచ్చువాడు వైద్యుడు

అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును,ద్విజుఁడున్
జొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య,కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
డెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

Friday, 22 May 2020

అడియాస కొలువుఁ గొలువకు

అడియాస కొలువుఁ గొలువకు
గుడి మణియము సేయఁబోకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దో డరయ కొంటి నరుగకు సుమతీ!

అధరము గదలియుఁ గదలక
మధురములగు భాష లుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ!

అప్పు గొని సేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁగీడు దెచ్చుర సుమతీ//

Thursday, 21 May 2020

శ్రీరాముని దయచేతను

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయఁనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ!

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ!