Wednesday 5 August 2020

పరనారీ సోదరుఁడై

పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుఁడై
పరులు దనుఁ బొగడ నెగడక
పరు లలిగిన నలుగ నతఁడు పరముఁడు సుమతీ!

సిరి దా వచ్చిన వచ్చును 
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

స్త్రీలయెడ వాదులాడకు
బాలురతోఁ జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

ఒక వ్రేలు పిడికిలగునా?
ఒక చేతను చేయు పనులు నొరవుగనగునా
ఒక చెట్టు తోట యగునా?
ఒకడాడినమాట యందు నొప్పునె సుమతీ!


Tuesday 4 August 2020

కడు బలవంతుడైనను

కడు బలవంతుడై నను
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ బుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియుఁ
బడుపుగ నంగడికిఁ తానె పంపుట సుమతీ!

కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుండు గవయ గూడుట యెల్లన్ 
బ్రేమమునఁ జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

తన కలిమి యింద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్
దనచావు జగత్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

Monday 3 August 2020

సరసము విరసము కొఱకే

సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెఱఁగుట విఱుఁగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ!

మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసిపోవుఁ గాని నెగడదు సుమతీ!

ఆకలి యుడుగని కడుపును
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నీతి యుదకము
మేఁకల పాఁడియును రోఁత మేదిని సుమతీ!

Sunday 2 August 2020

వెలయాలు సేయు బాసలు

వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలి పొందు,వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

వేసరపు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్ధుఁడు గానీ
దాసి కొడుకైన గానీ
కాసులు గలవాఁడె రాజు గదరా సుమతీ!

శుభముల నొందని చదువును
అభినయమును రాగ రసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభ మెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

Saturday 1 August 2020

వినఁదగు నెవ్వరు సెప్పిన

వినఁదగు నెవ్వరు సెప్పిన
వినినంతన వేగపడక వివరింప దగున్
కని కల్ల నిజముఁ దెలిసివ
మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ!

వీడెము వేయని నోరును
జేడెల యధరామృతంబుఁ చేయని నోరున్
బాడంగ రాని నోరును
బూడిద కిరవైనపాడు బొంతర సుమతీ!

వెలయాలి వలనఁ గూరిమి
గలుగదు మఱిఁ గలిగెనేని కడతేఱదుగా
పలువురు నడచెడి తెరువునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

Thursday 30 July 2020

లావుగల వాని కంటెను

లావు గల వాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయి తనముఁ బెట్టకుసుమతీ!

వరిపంట లేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ!

Wednesday 29 July 2020

మది నొకని వలచి యుండగ

మది నొకని వలచి యుండగ
మదిచెడి యొక కృూరవిటుడు మానక తిరుగన్
బొది జిలుక పిల్లి పట్టిన
జడువునె యా పంజరమున జగతిని సుమతీ!

రా పొమ్మని పిలువని యా
భూపాలుని ఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
చేపుణి కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ!